ఓ పార్టీకి మరో పార్టీకి మధ్య యుద్ధం.. తన ఫోటోని ట్రోల్ చేశారని ఆ మంత్రి ప్రతిపక్ష నేతను టార్గెట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ ట్రోల్ చేసినందుకు ఓ సినీ నటి కుటుంబం పరువుని బజారులో పెట్టింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరులో సమంత బలైంది. రాజకీయం కోసం ఇంతలా దిగజారాలా? సినిమా వాళ్ల జీవితాలను అడ్డం పెట్టుకోవాలా? ఇండస్ట్రీ అంటే అంత చులకనా? లేక చిన్న చూపా? ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో.
నిన్న రకుల్, నేడు సమంత, మరి రేపు ఎవరు? మరో హీరోయిన్ బలి కావాల్సిందేనా.. వివాదం ఏదో అయితే, యుద్ధం ఎక్కడో జరిగితే దాన్ని సినిమాకి, సినిమా వాళ్లకు ఆపాదించడం ఏంటి? ఇండస్ట్రీ అంటే మరి ఇంత చులకనా? సెలెబ్రిటీ జీవితం అన్నా, వ్యక్తిత్వం అన్నా.. ఇంత చిన్న చూపా? ప్రభుత్వ పెద్దలే ఇలా ఉన్నారంటే.. ప్రజల పరిస్థితి ఏంటి? సోషల్ మీడియా ట్రోలింగ్ కు హీరోలు, హీరోయిన్లు బలి కావాల్సిందేనా? ఇండస్ట్రీ అంటే ఇంత లోకువ ఎందుకు?
సినిమా సెలెబ్రిటీలు అన్నా, వాళ్ల లైఫ్ అన్నా.. ప్రతీ ఒక్కరికీ చులకనే. ఈజీగా ఓ మాట అనేస్తుంటారు. ఓ నిందను తోసేస్తుంటారు. ఇప్పుడు సమంత విషయంలోనే కాదు.. గతంలో చాలా మంది హీరోయిన్ల విషయంలో ఇదే జరిగింది. అసలీ పరిస్థితి కారణం ఏంటి? కలర్ ఫుల్డ్ అనిపించే సినిమా ఇండస్ట్రీకి ప్రతీసారి ఈ మరకలేంటి? ఎందుకు ప్రతిసారి చులకన అవుతోంది? మారటం ఎలా?
సమంతపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత ఇండస్ట్రీ అంతా ఏకమైంది. ఒక్క తాటిపైకి వచ్చి సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. దీంతో ఆ పార్టీ పెద్దలు కూడా దిగొచ్చారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దామన్నారు. ఇలా సమంత ఎపిసోడ్ ఓ ఆన్సర్ చూపించింది అనే చర్చ జరుగుతోంది. వివాదం చిన్నదైనా, పెద్దదైనా.. అంతా కలిస్తే ఎవరైనా దిగి రావాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీలో ఎవరి మీద ఎలాంటి ఆరోపణ వచ్చినా, విమర్శలు వినిపించినా.. ఇండస్ట్రీ అంతా ఏకమైతే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని, ఇండస్ట్రీ అంటే చులకన భావం పోయే పరిస్థితి ఉందని అంటున్నారు. మరి ఇండస్ట్రీలో ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే లేవు అనే సమాధానమే వినిపిస్తోంది.
ఇండస్ట్రీ వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరు నడుస్తోందనే ప్రచారం ఉంది. కుటుంబాల మధ్య, హీరోల మధ్య కూడా నిప్పులు రేగుతున్నాయి. ఇలా ఉంటే, సమస్యకు పరిష్కారం ఎలా అని ప్రశ్నించే వాళ్లు మరికొందరు. ఇక ఇండస్ట్రీని మరింత లోకువ చేస్తోంది, ఇబ్బంది పెడుతోంది ట్రోలింగ్, తప్పుడు ప్రచారాలు. దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యే కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లను మా బ్యాన్ చేయించింది. ఇండస్ట్రీ పెద్దలు కూడా రంగంలోకి దిగి ప్రభుత్వ పెద్దలను కలిసి సోషల్ మీడియాలో పరిశ్రమపై జరుగుతున్న విష ప్రచారానికి బ్రేకులు పడేలా చర్యలు తీసుకుంటే మంచిది.