బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్లో చేర్చుకోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని ప్రతిపక్షాలు అంటున్నాయని… అందుకే పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.
దేశంలో బీజేపీ ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో అందరికీ తెలుసునన్నారు. బండి సంజయ్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు. తాము ధర్మం తప్పలేదన్నారు.
తమ పార్టీలో చేరుతున్న వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదన్నారు. డిసెంబర్ 3 వరకు తమకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనే ఆలోచనే లేదన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామనేసరికి ఎమ్మెల్యేలు చేరుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలు అన్నారు. కులగణనపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.
భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాల్లో 43 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. ఇది అందరి జీవితంలో అలవాటు కావాలన్నారు. ప్రభుత్వం మొక్కలు పంపిణీ చేస్తోందని… కానీ ఇందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. కాలుష్యం తగ్గాలంటే, వ్యాధులు దరి చేరవద్దంటే అందరూ చెట్లు పెంచడంపై దృష్టి సారించాలన్నారు. ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయాలన్నారు. దీనిని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా సామాజిక కార్యక్రమంగా చేపట్టాలన్నారు.