ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని ఎంత గొప్పగా చేసి ఉండాల్సింది? ఏదో మొక్కుబడిగా చేశారు అంటూ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.
“వైఎస్సార్ 75వ జయంతికి జగన్ ఇడుపులపాయకు వెళ్లారు… వెళ్లి ఏం చేశారు? అక్కడ ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాల్లో ముగించేశారు. కనీసం అక్కడ కూర్చోలేదు… నిలబడే రాజశేఖర్ రెడ్డి గారికి తూతూ మంత్రంలా నివాళులు అర్పించేశారు. అంతేనా… సొంత తండ్రి కదా… 75వ జయంతిని జరిపే తీరు ఇదేనా?
‘సిద్ధం’ అంటూ పెద్ద పెద్ద సభలు పెట్టారు… పెద్ద పెద్ద హోర్డింగ్ లు పెట్టుకున్నారు… ఒక్కో సభకు రూ.30 కోట్లు, రూ.40 కోట్లు ఖర్చు పెట్టారు కదా… మరి రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఒక్క సభను కూడా ఎందుకు పెట్టలేకపోయారు మీరు? వైఎస్ 75వ జయంతి నాడు ఒక్క సభ పెట్టడం కాదు కదా… వైసీపీ నేతలంతా కలిసి నివాళులు కూడా అర్పించలేకపోయారు.
రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి మీకు స్పెషల్ కాదా? ఇలాగేనా జరుపుకునేది? మా నాయకుడు కాబట్టి, మా తండ్రి కాబట్టి, ఆయన మా పార్టీ నేత కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారి కోసం అంత పెద్ద సభ ఏర్పాటు చేశాం. ఆ సభకు ఓ ముఖ్యమంత్రి సహా పక్క రాష్ట్రంలోని మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు రాజశేఖర్ రెడ్డి జయంతి కోసం సందేశాలు పంపించారు. ఇవన్నీ మేం చేశాం… మరి మీరేం చేశారు? మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు?” అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.