ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పందంటూ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో బస్సు చార్జీల పెంపు ప్రతిపాదనపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. బస్సు చార్చీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు దూరంలో లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సామాన్య ప్రజలపై మరో భారం పడనున్నది. రాష్ట్రంలో త్వరలో బస్సు చార్జీలు భారీ స్థాయిలో పెరుగనున్నాయి. ప్రభుత్వ బస్సుల్లో చార్జీల పెంపు అనేది అనివార్యమని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) చైర్మన్ ఎస్‌ఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. బస్సు చార్జీలను 15-20 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేఎస్‌ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపిందని వెల్లడించారు. ‘రెండు రోజుల క్రితం మా బోర్డు సమావేశం జరిగింది. బస్సు చార్జీలను 15-20 పెంచాలని మేం ప్రతిపాదనలు పంపాం. మిగతాది సీఎం సిద్ధరామయ్య విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కేఎస్‌ఆర్టీసీ మనుగడ సాగించాలంటే, చార్జీల పెంపు తప్పనిసరి’ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇంధన, బస్సుల విడి పరికరాల ధరలు పెరిగాయని చెప్పారు. 2019 నుంచి రాష్ట్రంలో చార్జీల పెంపు లేదని, అదేవిధంగా కేఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల సవరణ కూడా 2020 నుంచి జరుగలేదని, కాబట్టి టికెట్ ధరలను పెంచడం అవసరమని చెప్పుకొచ్చారు. గత మూడు నెలల కాలంలో కార్పొరేషన్‌కు రూ.295 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు.