ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాల నుంచే ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేస్తామని, అవసరమైతే ఆర్డినెన్స్‌ను కూడా తీసుకొస్తామని అసెంబ్లీ సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వర్గీకరణ కోసం ఢిల్లీకి మంత్రులను పంపి న్యాయ నిపుణులతో చర్చించాం. సుప్రీంకోర్టులో పార్టీ పక్షాన బలమైన వాదనలను వినిపించాం. ఈ విషయమై సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇవ్వడం హర్షణీయం. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలంటూ ఇదే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెడితే నన్ను, నాటి ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను అప్పటి ప్రభుత్వం బహిష్కరించింది. గత ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళతామని చెప్పి మాదిగలను మోసం చేసింది.
దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని రాష్ట్రాలకంటే ముందుగానే తెలగాణలో వర్గీకరణను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం చేపడుతున్న ఉద్యోగ నియామకాల్లోనూ వర్గీకరణను అమలు చేస్తాం. దీనికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తాం. వర్గీకరణకు ఏకాభిప్రాయంతో అంతా సంపూర్ణంగా సహకరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్ కోరారు.