తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఆరోగ్యశ్రీకి ఇచ్చే మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని, రాష్ట్రం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉందన్నారు. అయినప్పటికీ సంక్షేమం, అభివృద్ధి ఆపడం లేదన్నారు. రూ.2 లక్షల రుణం ఉన్న రైతులకు త్వరలో మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే శిలాశాసనమే అన్నారు.
రైతులు పండించే సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు అవసరమైన సాయం అందిస్తామన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలన్నది తమ లక్ష్యమన్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందన్నారు. పదేళ్లలో అప్పులు పదిరెట్లు పెరిగాయని పేర్కొన్నారు. అప్పులు వామనావతారం లెక్క పెరిగాయన్నారు. అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ చేస్తామని ప్రగల్భాలు పలికి అప్పులపాలు చేశారన్నారు. ఓ వైపు అప్పులు పెరిగిపోగా… మరోవైపు బిల్లులు, బకాయిలు పెరిగిపోయాయన్నారు. గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చరమగీతం పాడారన్నారు.
దశాబ్దకాలంలో తెలంగాణ పురోగమించలేదన్నారు. ఒంటెత్తు పోకడలతో ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. జీతాలు, పెన్షన్ల చెల్లింపులు కూడా చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి చాలా క్లిష్టంగా ఉందన్నారు. దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామన్నారు. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఆపడం లేదన్నారు.