ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. బెంగళూరు ప్రజలకు కేవలం రూ.1కే ఆటో రైడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గత నెల 27 నుంచి ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా తమ యూపీఐ పేమెంట్స్ ప్రమోషన్లో భాగంగా ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు సంస్థ తెలిపింది. దీనికోసం నగరంలోని ఆటో డ్రైవర్లతో ఒప్పందం చేసుకుంది.
ఇక రూపాయికే ఆటో రైడ్ కావడంతో దీనికి మంచి స్పందన వస్తోంది. కేవలం రూ.1 చెల్లించి బెంగళూరు వాసులు ఆటో రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పీక్ అవర్స్ లో రద్దీ దృష్ట్యా సంస్థ పలు ప్రాంతాల్లో స్టాళ్లను కూడా ఏర్పాటు చేసింది.
“ఫ్లిప్‌కార్ట్ యూపీఐ అద్భుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఉత్సాహాన్ని నింపడానికి బెంగళూరులో రద్దీ సమయాల్లో ఒక్క రూపాయికే ఆటో రైడ్లను అందించడం జరుగుతుంది. రూ.1కి ఏదీ లభించని ఈ సమయంలో మా ప్రచారం చరిత్ర సృష్టించింది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో చూపిస్తూ జీవితాన్ని సులభతరం చేస్తోంది. చౌకగా లభిస్తోంది” అని ఆ సంస్థ పేర్కొంది.
ఇక ఒక్క రూపాయికే ఆటో రైడ్ అందుబాటులో ఉండడంతో నగర వాసులు భారీ సంఖ్యలో క్యూ కట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో తమ ప్రచారానికి అద్భుత స్పందన లభించిందని కంపెనీ వెల్లడించింది. రద్దీ సమయాల్లో ప్రయాణాలను సులభతరం చేయడంతో పాటు నగదురహిత సేవలను ప్రమోట్ చేసేందుకే ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఫ్లిప్‌కార్ట్ చెప్పుకొచ్చింది.
ఇక ఈ ఆఫర్‌ను బెంగళూరుకే పరిమితం చేయకుండా తమ ప్రాంతాలలో కూడా ప్రవేశపెట్టాలంటూ ఫ్లిప్‌కార్ట్‌ను పలువురు కోరుతున్నారు. ఇలాంటి సేవలు పొందకుండా ఉండేందుకు తామేం తప్పు చేశామని, తమకూ తక్షణమే ఇలాంటి ఆఫర్ ప్రకటించాలని ఇతర ప్రాంతాల వాసులు కంపెనీని కోరుతున్నారు.