రైతు బీమాపై డైలమా..!

google-display-ads-size-468x60-1

మాది మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలంలోని పాల్వంచ గ్రామంలోని నిరుపేద దళిత కుటుంబం. మాకు ఇద్దరు కుమారులున్నారు. వాళ్లు చిన్న వాళ్లు. మాకు ఊర్లో 1.20 ఎకరాల భూమి ఉంది. కొద్దిపాటి పొలంతో పాటు కూలినాలి చేసి బతుకుతున్నం. ఈ ఏడాది మే నెలలో నా భర్త అన్నారం గోపాల్‌ (40) అనారోగ్యంతో మరణిం చాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మా కుటుంబానికి రైతు బీమా పథకం కింద జూన్‌ మాసంలో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందింది. బీమా కింద వచ్చిన డబ్బులు మా కుటుంబానికి ఎంతో సాయంగా ఉపయోగపడ్డాయి. ఇలాంటి పథకం ఉండడం రైతులకు భరోసాగా నిలుస్తుంది’ ఇది రైతు బీమా పొందిన మహిళ అన్నారం మల్లమ్మ మాట. ఆమే కాదు.. రాష్ట్రంలో రైౖతు బీమా పథకం ద్వారా రూ. 5 లక్షల ఆర్థిక సహాయం పొందిన కుటుంబాలు లక్షకు పైగా ఉన్నాయి. అయితే ఆగస్టు 13తో 2023-24 ప్రీమియం గడువు ముగియ నుండటం, జులై 10 నుంచి చేపట్టాల్సిన కొత్త దరఖాస్తుల స్వీకరణ మొదలు కాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

గత ప్రభుత్వంలో అమలైన కొన్ని రైతు సంక్షేమ పథకాల్లో రైతు బీమా ఒకటి. రైతు సమూహ జీవిత బీమా పథకం ద్వారా రైతుకు ఎంత భూమి ఉన్నదనే దానితో నిమిత్తం లేకుండా పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతు ఏదైన కారణం చేత మరణిస్తే అతని నామినికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. తద్వారా రైతు కుటుంబానికి సకాలంలో ఆర్థిక భద్రత, ఉపశమనం కలుగుతుంది. దీనికోసం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీతో గత ప్రభుత్వం రైతుల కోసం బీమా పథకాన్ని 2018-19 సంవత్సరంలో ప్రారంభించింది. ఒక్కో రైతు పేరిట ప్రీమియం మొత్తాన్ని రూ.3437ను ప్రభుత్వమే ఎల్‌ఐసీకి చెల్లిస్తుంది. అనుకోకుండా రైతు మరణిస్తే అతని కుటుంబానికి పది రోజుల్లోనే రైతు బీమా పేరిట రూ.5 లక్షలు అందిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైతు బీమా కోసం రూ.1500 కోట్లు మొదట్లో కేటాయించినప్పటికి ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది.
రైతు బీమా.. ఎంతో ధీమా
రైతు బీమా పథకానికి ఎంతో ధీమా కల్పించేదిగా పేరుంది. ఈ పథకం కింద 18 నుంచి 59 సంవత్సరాలు కలిగిన రైతులు అర్హులవుతారు. రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 41.02 లక్షల మంది రైతులను అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరికి బీమా కోసం ఎల్‌ఐసీకి ప్రీమియం మొత్తంగా రూ.1477 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అధికారిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 2018 నుంచి 2024 వరకు 1,08,051 మంది రైతులు వివిధ కారణాల చేత చనిపోగా వీరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం కింద రూ.5402.55 కోట్లు అందజేయబడ్డాయి. రైతు బీమా పథకం కోసం ప్రతి ఏటా జులై 10 నుంచి ఆగస్టు 5 వరకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు, గతంలో రైతు బీమాలో నమోదు కాని రైతుల నుంచి వ్యవసాయ అధికారులు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి రైతు బీమా పథకంలో నమోదు చేస్తారు.
కొత్త పేర్ల నమోదు జరగట్లే
కాంగ్రెస్‌ ఫ్రభుత్వంలో ఇంకా రైతు బీమా పథకం కింద నమోదు ప్రక్రియ మొదలవ్వలేదు. ప్రతి ఏటా జులై 10 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు మండల కేంద్రాల్లోని వ్యవసాయ అధికారులు రైతుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల్ని స్వీకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన తర్వాత దరఖాస్తుల్ని స్వీకరించాల్సి ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం తర్వాత కొత్తగా పాసుపుస్తకాలు వచ్చిన రైతులు లక్షల్లో ఉంటారు. అయితే 2023-24 సంవత్సరంలో చెల్లించిన ప్రీమియం పాలసీ గడువు ఆగస్టు 13తో ముగియనుంది. అంతలోపు 2024-25 సంవత్సరానికి సంబంధించిన పాలసీ ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తేనే వచ్చే ఆగస్టు 14 నుంచి రైతులకు రైతు బీమా వర్తిస్తుంది. గడువులోపు పాలసీని పునరుద్దరించాలని రైతులు కోరుతున్నారు. అయితే దరఖాస్తుల్ని స్వీకరించకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
రైతు బీమా పథకం కింద సంగారెడ్డి జిల్లాలో 2,08,503 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 2,75,247 మంది రైతులున్నప్పటికీ వీరిలో 1,45,032 మంది మాత్రమే 59 ఏండ్ల వయసు లోపు ఉన్న రైతులు అర్హులుగా తేల్చారు. మెదక్‌ జిల్లాలో 1,20,504 మంది రైతులు రైతు బీమాకు అర్హులుగా అధికారులు తేల్చారు. రైతు బీమా పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 8038 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ.401.90 కోట్లు అందాయి. మెదక్‌ జిల్లాలో 5426 మంది రైతులు మరణించగా వారి నామినీల పేరిట రూ.271.30 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 1144 మంది మరణించగా ఇందులో 1050 మంది కుటుంబాలకు రూ.52.50 కోట్ల ఆర్థిక సహాయం అందజేశారు. ఇంకా 94 మందికి సాయం అందాల్సి ఉంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా కూడా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కల్గిన వాళ్లు తల్లిదండ్రుల పేరిట ఉన్న భూములకు పౌతీ ద్వారా, గిప్ట్‌ డీడ్‌ ద్వారా పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు. కొందరు భూముల్ని కొనుగోలు చేయడం ద్వారా కూడా పాసుపుస్తకాలు వచ్చాయి. వీరంతా కూడా రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకుంటే అవి ఎల్‌ఐసీ బీమా పథకంలో నమోదు చేయబడతాయి.

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1