తెలంగాణ(Telangana) లో మరో రెండు రోజుల పాటు వర్షాలు (Rains) కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఆదివారం సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం,నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది.
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు(Tamilanadu) , దక్షిణ ఆంధ్రప్రదేశ్(AP) తీరాల వెంబడి వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. ఈ నేపథ్యంలో యూపీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో దీని ప్రభావం కనిపిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. పంజాబ్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ ప్రభావం అక్టోబర్ 7, 8 తేదీల్లో యూపీ, బీహార్లోని కొన్ని జిల్లాల్లో కనిపిస్తుందని ఐఎండీ వెల్లడించింది.