ఆపరేషన్ మూసీలో మరో లేటెస్ట్ పరేషాన్ మొదలైంది. ఓవైపు రివర్ బెడ్‌లో ఇళ్ల కూల్చివేత, నిర్వాసితుల తరలింపు కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు నిరసనలు భగ్గుమంటున్నాయి. పరస్పర విమర్శలతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ నేతలతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. నమామి గంగా ప్రాజెక్టులో 2 వేల 500 కిలోమీటర్ల దూరానికి కేంద్రం 20 వేల కోట్లు ఖర్చు చేయలేదు. మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్లతో ప్రాజెక్ట్ అంటే తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఐతే, ఈటల మూసీ బాటలో వుంటే మల్కాజ్‌గిరి అడ్డాగా విపక్షాలపై విమర్శల ఈటెను విసిరారు సీఎం రేవంత్ రెడ్డి.
పేద వాళ్ళు ఎప్పడూ మూసిలోనే ఉండాలా..? మీరు మాత్రం ఓట్లు వేయించుకుంటారా..? అంటూ విపక్షాలపై విమర్శలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. మేం ఎవరినీ వదలం..అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. సీఎం వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు ఎంపీ ఈటల రాజేందర్. మూసీ ప్రక్షాళనపై విమర్శలు చేయడం కాదు.. ఓట్లు వేయించుకున్న బీజేపీ ఎంపీలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ఎంపీలు కలిసి వస్తే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లడానికి తమకు ఎలాంటి బేషజాలు లేవన్నారు.
ప్రధాని మోదిని కలవడానికి తాము రెడీ అని సీఎం అంటే.. అంతకన్నా ముందు మూసీ నిర్వాసితుల దగ్గరకు వెళ్దాం రా అని సవాల్ విసిరారు ఈటల రాజేందర్. అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని శెభాష్ అని మెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సెక్యూరిటీ లేకుండా రావాలని సవాల్ విసిరారు.
అలా మూసీ పే సవాళ్ల సౌండ్ మాత్రమే కాదు… మల్కాజ్‌గిరిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమంలో ప్రొటోకాల్ రచ్చ రాజుకుంది. తనను ఆహ్వానించకపోవడంపై లోకసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు ఎంపీ ఈటల రాజేందర్. ప్రొటోకాల్ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో రివ్యూ చేస్తామని స్పందించారు మంత్రి శ్రీధర్‌బాబు. మూసీ అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఛాలెంజ్‌పై తగ్గేదేలేదన్నారు.