పారిస్ ఒలింపిక్స్లో భాగంగా శుక్రవారం జరిగిన పురుషల రెజ్లింగ్ కాంస్య పోరులో 21 ఏళ్ల అమన్ సెహ్రావత్ తొలి పతకం సాధించాడు. 57 కిలోల విభాగంలో అమన్ .. ప్యూర్టోరికోకు చెందిన దరియన్ టోయ్ క్రజ్ను 13-5తో ఓడించి ఈ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రెజ్లింగ్‌లో తొలి పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ గెలుపుతో ఇప్పటి వరకు భారత్ ఖాతాలో మొత్తం 6 ఒలింపిక్స్ మెడల్స్ చేరాయి. ఇందులో ఒక రజతం, ఐదు కాంస్యాలు ఉన్నాయి.
ఒలింపిక్స్ బరిలో భారత్ తరఫున బరిలోకి దిగిన ఏకైక మేల్ ప్లేయర్ అమన్. ఒలింపిక్స్లో వ్యక్తిగత పతకం సాధించిన అతి పిన్న వయస్సు గల భారత అథ్లెట్‌గా అమన్ రికార్డుకు ఎక్కాడు. అమన్ కంటే ముందే ఈ రికార్డును బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు కాంస్య పోరులో అమన్ విజయం సాధించడం పట్ల ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అమన్ అంకితభావం, పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఎక్స్ వేదికగా కొనియాడారు. ఈ ఘనతను దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుందని పేర్కొన్నారు.