శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి కొలువైన శ్రీశైలంలో అపచారం జరిగింది. ఓ ఉద్యోగి మద్యం తాగి విధులకు హాజరు కావడంతో భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. ఆయనను పట్టుకుని చితకబాదారు. గతరాత్రి 9 గంటల సమయంలో క్యూ కంపార్ట్మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగికి దేహశుద్ధి చేసిన అనంతరం భక్తులు ఆలయ క్యూ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆందోళనపై సమాచారం అందుకున్న సహాయ కార్య నిర్వాహక అధికారి జి.స్వాములు అక్కడికి చేరుకుని భక్తులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆయనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది మద్యం తాగి విధులకు వస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆలయ పవిత్రతను కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై ఈ ఉదయం ఈవో పెద్దిరాజుకు భక్తులు ఫిర్యాదు చేశారు.