న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) నిర్లక్ష్యం ముగ్గురు విద్యార్థుల నిండు ప్రాణాలు బలి కావటానికి కారణమైంది. ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో వరదతో గ్రౌండ్ ఫ్లోర్ నిండిపోవటం, అందులో చిక్కి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం విదితమే. అయితే, ఈ ప్రమాదానికి దాదాపు నెల రోజుల ముందే యూపీఎస్సీ అభ్యర్థి ఒకరు ఎంసీడీని అప్రమత్తం చేశారు. బేస్మెంట్ను అక్రమంగా ఉపయోగించటంపై ఫిర్యాదు చేశాడు. సివిల్ సర్వీసెస్ ఔత్సాహికుడైన కిషోర్ సింగ్ కుష్వా.. గతనెల 26న కోచింగ్ సెంటర్‌పై ఫిర్యాదు చేశాడు. ఈనెల 15, 22 తేదీలలో పౌర సంస్థకు రిమైండర్లు అందాయి. ”అనుమతి లేనప్పటికీ..వారు (కోచింగ్ సెంటర్) ఎన్ఓసీ లేకుండా బేస్మెంట్లో తరగతి గదిని నడుపుతున్నారు. పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇది విద్యార్థులు, సిబ్బంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. పెద్ద ప్రమాదం జరిగే అవకాశమున్నది. పెద్ద యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు చట్టవిరుద్ధమైన ప్రదేశాల్లో విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి తరగతులు నిర్వహిస్తున్నాయి” అని కుష్వా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈనెల 15న రిమైండర్లో ”సార్, ఇది చాలా ముఖ్యమైన, అత్యవసర సమస్య. కఠిన చర్యలు తీసుకోండి” అని రాశారు. విద్యార్థులు వరదలో మునిగి చనిపోవటానికి ఐదు రోజుల ముందు తన రెండో రిమైండర్లో కుష్వా.. అధికార యంత్రాంగం జోక్యాన్ని కోరాడు. ”సార్ దయచేసి చర్య తీసుకోండి. ఇది విద్యార్థుల భద్రతకు సంబంధించిన సమస్య” అని వివరించాడు. అయితే ఆ తర్వాత రోజుల్లో ఆయన ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కాగా, ఆన్లైన్లో ఆయన ఫిర్యాదు ప్రస్తుత స్థితి ‘ప్రాసెస్‌లో ఉన్నది’ అని కనిపించటం గమనార్హం. కాగా, కుష్వా ఫిర్యాదుపై ఢిల్లీ మున్సిపల్ అధికారులు స్పందించి ఉంటే ముగ్గురు విద్యార్థుల విలువైన ప్రాణాలు పోయేవి కావని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోచింగ్ సెంటర్లపై అధికారుల చర్యలు
విషాదం జరిగిన ఒక రోజు తర్వాత కోచింగ్ సెంటర్లపై అధికారులు చర్యలు తీసుకోవటం ప్రారంభించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆదివారం నాడు రాజిందర్ నగర్, సమీప ప్రాంతాల్లోని 13 కోచింగ్ సెంటర్ల బేస్మెంట్లను ఎంసీడీ మూసివేసింది. ఇందులో రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ కూడా ఉన్నది. బేస్మెంట్లలో ఏవైనా వాణిజ్య కార్యకలాపాలు చట్టవిరుద్ధమనీ, స్టోరింగ్, పార్కింగ్‌కు మాత్రమే అనుమతించబడతాయని ఎంసీడీ అధికారులు తెలిపారు. రౌస్ స్టడీ సర్కిల్ నడుస్తున్న భవనానికి సంబంధించిన ఆగస్ట్ 9, 2021 నాటి పూర్తి ప్రమాణ పత్రం ప్రకారం.. బేస్మెంట్లో రెండు మెట్లు, రెండు లిఫ్టులు, రెండు లిఫ్ట్ లాబీలు, పార్కింగ్ బే, కార్ లిఫ్ట్, గృహ నిల్వకు మాత్రమే అనుమతున్నదని పేర్కొన్నది. కాగా, బేస్మెంట్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని మేయర్ షెల్లీ ఒబెరారు ఆదివారం ఆదేశించారు.అధికారిక ఆప్ ఎంసీడీ ఇన్చార్జి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ సైతం బేస్మెంట్లలో కూడా వాణిజ్య కార్యకలాపాలను ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఆప్‌లో చేరటానికి ముందు ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు దుర్గేశ్ పాఠక్ సిద్ధమయ్యారు. ”కేవలం రాజిందర్ నగర్లోనే కాదు… ఢిల్లీలోని అనేక ఇతర ప్రాంతాలలో, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు వాణిజ్య కార్యకలాపాల కోసం బేస్మెంట్లను ఉపయోగిస్తున్నాయి. పిల్లలు బేస్మెంట్లలో ఎందుకు చదువుతున్నారు? ఇవి నేరపూరిత చర్యలు. దీనికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని దుర్గేశ్ పాఠక్ అన్నారు. ఇలాంటి కార్యకలాపాలను గుర్తించకపోతే ఢిల్లీ మొత్తం నాశనమవుతుందని చెప్పారు.కాగా, ఢిల్లీలో 1,000కి పైగా కోచింగ్ సెంటర్లున్నాయని అంచనా. వందలాది ఇన్స్టిట్యూట్లకు నిలయంగా ఉన్న ముఖర్జీ నగర్‌లోని ఒక కేంద్రంలో గతేడాది భారీ అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత ఎంసీడీ కోచింగ్ సెంటర్ల సర్వే నిర్వహించింది.
ఐదుగురి అరెస్ట్.. అధికారిని విధుల నుంచి తొలగించిన ఎంసీడీ
‘రౌస్ స్టడీ సర్కిల్’ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టు ముందు హాజరుపర్చారు. అలాగే, కరోల్ బాఫ్‌ు జోన్ కార్య నిర్వాహక ఇంజినీర్ కార్యాలయంలో జూనియర్ ఇంజినీర్‌గా ఉన్న వినరు మిట్టల్‌పై ఎంసీడీ చర్యలు తీసుకున్నది. ప్రమాద ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ఎంసీడీ ఆయనను విధుల నుంచి తొలగించింది. కాగా, ఈ ప్రమాద ఘటన విషయంలో బీజేపీ ఆందోళన చేపట్టింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
నరకంలో జీవిస్తున్నాం..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సివిల్స్ విద్యార్థి లేఖ
వరదల కారణంగా ఢిల్లీ లో ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సివిల్స్ విద్యార్థి ఒకరు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్‌కి లేఖ రాశారు.సివిల్స్ విద్యార్థి అవినాశ్ దూబే ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్ స్టడీ సెంటర్లో ఉన్న లోపాలను లేఖలో వివరించాడు. ”ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ విద్యనభ్యసించడమనేది మా ప్రాథమిక హక్కు. నీటి ఎద్దడి, వరదల కారణంగా విద్యార్థుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. మాకు సురక్షితమైన వాతావరణం అవసరం. అప్పుడే నిర్భయంగా చదువుపై దృష్టి సారించగలం. దేశ అభివృద్ధిలో భాగమవ్వగలం” అని పేర్కొన్నారు.తమతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేలవమైన మౌలిక సదుపాయాల గురించి వెల్లడించాడు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వర్షాలు పడినప్పుడల్లా నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నాడు. నిబంధనలను ఉల్లంఘించి బేస్మెంట్లను లైబ్రరీలుగా మార్చారని.. వారి నిర్లక్ష్యం వల్లే ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించాడు. తామంతా నరకంలో జీవిస్తున్నట్టు లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థుల మరణాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.