కాంగ్రెస్ ప్రభుత్వం కాసుల వేటలో పడింది. ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఒక్కో అంశంపై నాలుక మడతెట్టేసింది. తాజాగా లే అవుట్ క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) విషయంలోనూ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని కాంగ్రెస్ కీలక నేతలు చేసిన యాగీ అంతా ఇంతాకాదు. అడ్డగోలు ప్రకటనలు ఇచ్చి.. నానా గగ్గోలు పెట్టారు. వచ్చేది తామేనని.., ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని ప్రకటనలిచ్చారు. పేద ప్రజల రక్తం తాగుతున్నారని ఆనాటి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యాయపోరాటానికి సిద్ధమని సవాళ్లు విసిరారు. అలా మాటలు చెప్పి గుండెలు బాదుకున్న నేతలందరూ నేడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఇప్పుడేమో నాటి మాటలను పక్కన పెట్టి.. ‘నో’ అన్న ఎల్ఆర్ఎస్కు ‘ఎస్’ అంటూ జై కొడుతున్నారు. పేదల ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలుకు రంగం సిద్ధం చేశారు.
25.70 లక్షల దరఖాస్తులు
రాష్ట్రవ్యాప్తంగా లేఅవుట్ క్రమబద్ధీకరణకు మొత్తం 25.70లక్షల దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1.06లక్షలు, హెచ్ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 1.35 లక్షలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 13.68 లక్షలు, పంచాయతీల్లో 6 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 4.28 లక్షల దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 23వేల దరఖాస్తులను తిరస్కరించారు. డాక్యుమెంట్లు, సరైన సమాచారం ఇవ్వకపోవడంతో దరఖాస్తుల షార్ట్ ఫాల్స్‌లో 2.22లక్షల దరఖాస్తులు ఉన్నాయి.
60వేల దరఖాస్తులను ఆమోదించారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసిన 25 లక్షల మంది ద్వారా రూ.20వేల కోట్లకు పైగా వసూలు చేసేందుకు తాజాగా ప్రభుత్వం సిద్ధమైంది. 2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలలపాటు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. ఓపెన్ ప్లాట్లు, నాన్ లేఅవుట్‌కు సంబంధించిన వాటికి దరఖాస్తుదారులు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి, తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లేఅవుట్ స్థలాలకు సంబంధించి రూ.10 వేలు దరఖాస్తు ఫీజుగా చెల్లించారు. అంతటితోనే ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కోర్టు కేసులతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను
తాజాగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ కోసం ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు సూచించింది. దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయడానికి అవసరమైతే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై సిబ్బందిని తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒకటి రెండు నెలల్లో అన్నింటినీ పరిశీలించి నిధులను ఖజానాకు మళ్లించాలని సర్కారు ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఇప్పు డు వారికి గుదిబండగా మారనున్నది.