ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీనియర్ నాయకుడని… ఆయనకూ సభా వ్యవహారాలు తెలుసునని, సభా నాయకుడిని పట్టుకుని అనుభవం లేదని కేటీఆర్ అనడం సరికాదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క హితవు పలికారు. బీజేపీకి కోపం వస్తుందనే కేటీఆర్ అసలు విషయాన్ని వదిలేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ… బీఆర్ఎస్‌కు పార్టీ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని నిలదీశారు.
కేంద్ర బడ్జెట్‌లో మూసీకి, మెట్రోకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. తాము అడుగుతున్నవి హక్కుగా తమకు రావాల్సినవే అన్నారు. తాము బీజేపీతో జతకట్టామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు. ఏడు మండలాల గురించి అసలు మీరేం చేశారని ప్రశ్నంచారు. ఏడు మండలాల విషయం లేకుండానే ఏపీ పునర్విభజన బిల్లు పాస్ అయిందని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత ఏపీలో కలిపారన్నారు.
వివిధ అంశాలపై ఢిల్లీలో యుద్ధం అన్నారని… మరి చేశారా? అని ప్రశ్నించారు. కనీసం మాటైనా అడిగారా? అన్నది చెప్పాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంకు కనీసం నీళ్ళు కూడా ఇవ్వని వారు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రభుత్వంతో కలిసి రావాలని కోరారు. అప్పుడు కేంద్రం నుంచి నిధులు ఎందుకు రావో చూద్దామన్నారు. మూసీ ప్రాజెక్టుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు కోసం డీపీఆర్ ఇచ్చామన్నారు. ఐటీఐఆర్‌ను బీజేపీ, బీఆర్ఎస్ గాలికి వదిలేశాయన్నారు.