సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో ఇవాళ మహిపాల్‌రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. స్టేట్‌మెంట్ రికార్డ్ అనంతరం ఈడీ ఆఫీస్ నుంచి ఆయన వెళ్లిపోయారు. ఇక ఇటీవల మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూధన్‌రెడ్డి, వారి బంధువుల ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం రెండు రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి.
కాగా, ఈ సోదాల్లో మైనింగ్ శాఖకు కట్టాల్సిన సీనరేజ్ సొమ్ము రూ. 342 కోట్లు ఎగ్గొట్టారని లెక్కలు తేల్చారు. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని నోటీసులను సైతం జారీ చేశారు. లీజులో లేని భూమిలో అక్రమ మైనింగ్ పాల్పడినందుకు గూడెం మధుసూదన్‌రెడ్డిపై రెవెన్యూ, మైనింగ్ శాఖలు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు.