అడ్డదారులు తొక్కి, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని… ఇప్పుడు రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ఉండాలనే నిబంధన పెట్టారని విమర్శించారు. రైతు రుణమాఫీకి 6 పేజీల నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయని చెప్పారు. రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుని 7 నెలలైనా ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ విశ్వసనీయత లేని నాయకుడని.. అందుకే ఆయనకు ప్రజలు బొంద పెట్టారని అన్నారు. కేసీఆర్ ను ఓడించాలని కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని చెప్పారు.
16/07/2024
తెలంగాణ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన అంశంపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుతో లింకు పెట్టొద్దని సూచించారు. అయితే రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి. ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.
రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం..
ఇక ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు.
మానవీయ కోణంలో నిర్ణయాలు..
అలాగే ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చని, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ‘క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏమిటో తెలుసుకోండి. ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా సంతృప్తి ఉండదు. డిసెంబర్ 24న కలెక్టర్లతో తొలిసారి భేటీ నిర్వహించాం. ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించాం. ఎన్నికల కోడ్ ముగియగానే కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలి. ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకునేలా పనిచేయాలి’ అన్నారు.
ఈ సమావేశంలో 9 కీలక అంశాలతో ప్రభుత్వం ఎజెండా రూపొందించింది. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం – కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం – సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు – ఇతర భద్రతాపరమైన అంశాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)కు సంబంధించి రోజుకో వివాదం తెరపైకి వస్తుంది. తాజాగా విద్యాశాఖ విడుదల చేసిన హాల్ టికెట్లు కూడా సరికొత్త వివాదాలకు తెరలేపాయి. నిన్నటికి నిన్న ఒక జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారికి, మరోక జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా హాల్‌టికెట్‌లో రావడంతో చర్చణీయాంశంగా మారింది. ఇలా ఒకరిద్దరికి మాత్రమే కాదు అనేక మంది హాల్ టికెట్లలో ఇలాగే తప్పులు దొర్లినట్లు తేలింది. దీంతో విద్యాశాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇక తాజాగా ఓ అభ్యర్ధి హాల్ టికెట్లో ఏకంగా మనిషినే మార్చేశారు. అబ్బాయి హాల్ టికెట్‌పై అమ్మాయి ఫొటో, అమ్మాయి హాల్ టికెట్‌పై అబ్బాయి ఫొటో, సంతకం ఉండటాన్ని అభ్యర్థులు గుర్తించి గందరగోళంలో పడ్డారు.
మేడ్చెల్ జిల్లా దమ్మాయి గూడ బాలాజీ నగర్‌కు చెందిన పల్లెపు రామచంద్రయ్య అనే అభ్యర్ధి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోగా.. తాజాగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో అతని పేరు సక్రమంగానే ఉన్నా, ఫొటో మాత్రం ఎవరో అమ్మాయిది వచ్చింది. సంతకం కూడా తనది కాదని గుర్తించి పరేషాన్ అయ్యాడు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందినన రుద్రారపు భవ్య ఎస్ఏ పోస్టుకు అప్లై చేయగా.. హాల్ టికెట్లో ఆమె ఫొటో బదులు వేరే అబ్బాయి ఫొటో వచ్చింది. దీంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని పలువురు అభ్యర్ధులు వాపోతున్నారు. హాల్ టికెట్ల రూపకల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
డీఎస్సీ పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. పరీక్షలు సమీపిస్తున్న వేళ సీరియస్‌గా సన్నద్ధమవుతున్న అభ్యర్ధులు ఇలా హాల్ టికెట్ల కోసం అధికారుల చుట్టూ తిరుగుతుండటంతో గందరగోళం నెలకొంది. అయితే ఈ తప్పిదాలకు విద్యాశాఖ కారణం కాదని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు చేసిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. అసలు తామెలా ఫొటోలు, సంతకాలు మారుస్తామని అధికారులు ప్రశ్నిస్తున్నారు. సిస్టమ్ జనరేటెడ్ హాల్ టికెట్లను తాము చూసే అవకాశమే లేదని, తప్పులు దొర్లినట్టు వచ్చిన అభ్యర్థులకు తక్షణమే సరిచేసి, కొత్తవి జారీ చేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరుకానున్నారు. ఎన్నికల హామీలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ లోని కొన్ని పథకాలపై లోతుగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో… ప్రభుత్వంపై ప్రజల స్పందన ఎలా ఉందనే దానిపై కూడా చర్చించవచ్చని సమాచారం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇప్పటి వరకు విడుదల చేసిన శ్వేతపత్రాలు, విడుదల చేయబోతున్న శ్వేతపత్రాలపై చర్చ జరుపుతారు.
మరోవైపు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ధరణి, వ్యవసాయం, ప్రజాపాలన, వాతావరణ పరిస్థితులు, సీజనల్ వ్యాధులు, ఆరోగ్యం, వన మహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
జీహెచ్ఎంసీలో ప్రజావాణి కంటితుడుపు చర్యగా మారింది. దూర ప్రాంతాలు నుంచి వచ్చి..ఎంతో ఆశగా అపరిష్కృత సమస్యను మేయర్, కమిషనర్‌కు విన్నవిస్తే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్న అర్జీదారులకు నిరాశే ఎదురవుతున్నది. గడిచిన నాలుగు వారాలుగా ప్రతి సోమవారం నిర్వహించే ఈ విశిష్ట కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి పాల్గొనడం లేదు. మేయర్, కమిషనర్ లేని ప్రజావాణిని ఉన్నతాధికారులు తూతూ మంత్రంగా ముగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పైగా ప్రజావాణిలో ఒకసారి కాకుంటే మరోసారి వచ్చి ఫిర్యాదు చేసినా.. లాభం ఉండటం లేదని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 6 నెలల నుంచి జీతాలు లేక బతకడమే కష్టంగా మారిందని ఈఎస్ఐ ఆసుపత్రి స్వీపర్స్, సెక్యూరిటీ సిబ్బంది అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. తమను నియమించిన ఏజెన్సీలు తమకు జీతాలు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇప్పటికీ నాలుగు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ లేబర్ ఆఫీసర్‌ను కలవాలని చెబుతున్నారని.. అక్కడికి వెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు సాజీదా బేగం, సుజాత, రజినీ, యాదమ్మ మాట్లాడుతూ.. ‘మాకు జనవరి నుంచి ఇప్పటి వరకు జీతం ఇవ్వలేదు. ఆ డబ్బులొస్తేనే మా పిల్లలకు స్కూలు, కాలేజీల ఫీజులు చెల్లించగలం. ఇంటి కిరాయి కట్టుకోగలం. కడుపునిండా అన్నం తినగలం. ఆ జీతం రాక రోజు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అని వాపోయారు.
రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మభ్యపెట్టిందని, అధికారంలోకి వచ్చాక వడపోతలపై దృష్టి పెట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. రుణమాఫీకి ఇన్ని ఆంక్షలు సరికాదన్నారు. రేషన్ కార్డు నిబంధన అంటే లక్షలాదిమంది రైతుల ఆశలపై నీళ్లు జల్లడమే అన్నారు. రుణమాఫీకి విధించిన గడువు కూడా అసమంజసంగా ఉందన్నారు. డిసెంబర్ 12, 2018కి ముందు రుణమాఫీ వర్తించదనడం సరికాదన్నారు.
రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పంటల రుణమాఫీ విషయంలో ఎన్నికల సమయంలో ఒకమాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు.
రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కంటే ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనబడుతోందన్నారు. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికమని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలు నీరుగారినట్లే అన్నారు. ఎన్నికలప్పుడు మభ్యపెట్టి… అధికారం చేజిక్కించుకున్నాక ఆంక్షలు పెట్టడమేమిటన్నారు.