కాంగ్రెస్‌ హామీలకు 300 రోజులు.. మ్యానిఫెస్టోలోని 6 గ్యారెంటీల్లోని 13 హామీలు అసంపూర్తిగా అమలు

google-display-ads-size-468x60-1

 తియ్యటి మాటలు చెప్పారు.. 420 హామీలు ఇచ్చారు.. అధికారం చేపట్టిన 100 రోజుల్లో హామీలు అమలుచేస్తామన్నారు.. దేవుళ్లపై ఒట్లు వేశారు.. కానీ, పాలనాపగ్గాలు చేపట్టి 300 రోజులైనా హామీల అమలును పట్టించుకోవడం లేదు. ఇదీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరు. మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, ఉద్యమకారులు, ఆటోడ్రైవర్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, కులవృత్తులు.. ఇలా సబ్బండవర్ణాల ప్రజల ఓట్లను దృష్టిలో పెట్టుకొని 420 హామీలతో మ్యానిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్‌ పార్టీ. వాటిని చూసి ప్రజలు ఆ పార్టీకి ఓట్లేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి అక్టోబర్‌ ఒకటో తేదీనాటికి 300 రోజులైనా హామీలు అమలు కావడం లేదు. పాత ఆర్టీసీ బస్సుల్లో కష్టాల మధ్య మహిళల ఉచిత ప్రయాణం ఒక్కటే అమలవుతున్నది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలు అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ మూడు మినహా మిగతా హామీలన్నీ అటకెక్కాయి. నిరుపేద మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, నిరుద్యోగ యువతులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్ల పంపిణీ హామీలపై రేవంత్‌రెడ్డి సర్కారు కనీసం నోరు మెదపడం లేదు. వానకాలం సీజన్‌ అయిపోయినా రైతుభరోసా ఇవ్వలేదు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ నేటికీ సగం మంది రైతులకు దక్కనేలేదు. పింఛన్లు రూ.రెండువేల నుంచి నాలుగవేలకు, రూ.నాలుగువేల నుంచి ఆరు వేలకు పెంచుడు మాటలకు పరిమితమైంది. మహిళలకు నెలకు రూ.2,500 అందని ద్రాక్షగానే మిగిలింది. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ మాట నీటిమూటలా మారింది.

మొత్తం 42 పేజీలతో 420 హామీలతో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను రూపొందించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు వివిధ వర్గాలను ఆకట్టుకొనేలా హామీలను ప్రకటించింది. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే హామీలు అమలుచేస్తామని మాటిచ్చింది. కానీ, 300 రోజులు అయినా 420 హామీలో కనీసం పది పథకాలు కూడా పట్టాలెక్కలేదు. కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపిందని రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఇతర వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కుటుంబంలో ఒక్కరికే పింఛన్‌ అందితే, కుటుంబంలో అర్హులైన ఇద్దరికి పింఛన్‌ ఇవ్వడంతోపాటు రూ.2 వేలను రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా పింఛన్లు రాకపోగా పాతవి కూడా సక్రమంగా అందటం లేదని వృద్ధులు, వితంతువులు వాపోతున్నారు. వానకాలం సీజన్‌ ముగిసిపోతున్నా కేసీఆర్‌ ఇచ్చిన రూ.10,000 రైతుబంధు నేటికీ అందలేదు. రైతుభరోసా కింద రైతులు, కౌలురైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ.15,000పై కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోరు మెదపడం లేదు. వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఇచ్చే హామీపై విధివిధానాలైనా రూపొందించారా? అంటే అదీ లేదు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో తమ ఉపాధి దెబ్బతిన్నదని, ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం అందిస్తామన్న హామీ ఇంకెప్పుడు అమలుచేస్తారని ఆటోడ్రైవర్లు నిలదీస్తున్నారు.

revanth-reddy-appeal-to-unemployees

  • మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు కూడా భర్తీ
  • ఏటా జూన్‌ 2 నాటికి అన్నిశాఖల ఖాళీలతో జాబ్‌ క్యాలెండర్‌
  • సెప్టెంబర్‌ 17లోపు వివిధ శాఖల్లో ఖాళీ ఉన్న నియామకాల భర్తీ
  • ఉపాధి కల్పించే వరకు ప్రతినెలా రూ.4,000 నిరుద్యోగ భృతి
  • యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు
  • ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు
  • ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ
  • ప్రతి విద్యార్థికీ ఫ్రీ (ఇంటర్నెట్‌) వైఫై సౌకర్యం
  • ప్రపంచస్థాయి క్రీడావర్సిటీని నెలకొల్పి గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
  • రాష్ట్రంలోని రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ
  • రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 రైతు భరోసా
  • వ్యవసాయ కూలీలకు రూ.12,000, వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌.
  • రూ.3 లక్షల వరకు వడ్డీలేని పంట రుణాలు
  • మూతపడిన చక్కెర కర్మాగాలు తెరిపించడం, పసుపు బోర్డు ఏర్పాటు చేయడం
  • నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యమకారులు, ఇల్లు లేనివారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటిస్థలంతోపాటు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల సాయం
  • తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం
  • ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు తక్షణం చెల్లింపు
  • అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.18 వేలకు పెంచి ఈపీఎఫ్‌ పరిధిలోని తీసుకొనిరావడం
  • రవాణా వాహనాలకు సింగిల్‌ పర్మిట్‌ విధానం అమలుచేయడం
  • ప్రతి ఆటోడ్రైవర్‌కు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం
  • నెలవారీ పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంపు
  • దివ్యాంగుల పింఛన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంపు
  • తొలి, మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలను గుర్తించిఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.25,000 పింఛన్‌
  • అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1